హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్ వేదికగా యువకులను పరిచయం చేసుకుని మత్తుమందు ఇచ్చి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న మరో నిందితుడు చందు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రిండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా బాధితులతో చాటింగ్ మరియు వీడియో కాల్స్ మాట్లాడుతూ ఇంట్లో ఒంటరిగా ఉండే వారిని గుర్తించి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల వివరాలను ముందుగానే తెలుసుకునేవారని పోలీసులు వెల్లడించారు.
నమ్మకం కుదిరిన తర్వాత బాధితుల ఇళ్లకు వెళ్లి మద్యం సేవించే సమయంలో బీర్‌లో మత్తు పదార్థాలు కలిపి తాగించేవారు. బాధితులు స్పృహ కోల్పోయిన వెంటనే వారి ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు మరియు విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యేవారు. సాంకేతిక ఆధారాలతో నిఘా పెట్టిన ఉప్పల్ మరియు కుషాయిగూడ పోలీసులు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి 361 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరితో పాటు విశాఖపట్నంలో మొత్తం 14 కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది.

