బంగాళాఖాతంలో బలపడిన అక్వాన్ తీవ్ర తుఫాన్ ప్రస్తుతం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా తీరం వైపు కదులుతోంది. ఎల్లుండి మధ్యాహ్నానికి ఇది తీరం దాటే అవకాశం ఉందని ఆ సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా రాబోయే 48 గంటల పాటు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో రేపు ఎల్లుండి కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని రైతులు తమ పంటల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని స్పష్టం చేశారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

