ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో పర్యటించనున్నారు. ఏర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వేదికగా జరగనున్న 61వ అఖిల భారత డీజీపీ ఐజీపీల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు.
మూడు రోజుల పాటు సాగే ఈ జాతీయ స్థాయి భద్రతా సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొననున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా ఐపీఎస్ అధికారులు మరియు 200 మంది ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుపతి మరియు ఏర్పేడు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

