కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రాల నుంచి 815 మంది మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మందితో కలిపి మొత్తం 850 మంది సభ్యులతో లోక్ సభ ఏర్పాటైతే ప్రజా సమస్యలపై చర్చలకు అవకాశం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 543 మంది సభ్యులతోనే సభను నిర్వహించడం కష్టంగా ఉందని సభ్యుల సంఖ్యను భారీగా పెంచితే చాలామంది కేవలం చప్పట్లు కొట్టడానికే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించే వేదికగా పార్లమెంట్ పనిచేయాలని శశి థరూర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాజకీయంగా తమ పార్టీకి అనుకూలంగా సరిహద్దులు గీయాలని ప్రభుత్వం భావిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల ప్రయోజనాల కోసం కాకుండా దేశ దీర్ఘకాలిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు.

