ఏపీలో రాజకీయం లిక్కర్ చుట్టూ తిరుగుతోంది. అధికార పార్టీ నేతలు బెదిరింపులు, భేరసారాలతో మద్యం షాపులు దక్కించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో మొత్తం 3396 మద్యం దుకాణాలకు ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో అధికార పార్టీ నేతలే ఎక్కువ దరఖాస్తులు వేశారు. మంత్రి నారాయణ 100 దరఖాస్తులు వేయిస్తే మూడు వరించాయి. అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావుకు ఐదు దుకాణాలు దక్కాయి. విజయవాడకు చెందిన ఓ టీడీపీ లీడర్ 480 అప్లికేషన్లు వస్తే 11 షాపులు వచ్చాయి.
అడుగడుగునా దౌర్జన్యం..
లాటరీ ప్రక్రియ అంతా అధికార పార్టీ నేతల కనుసన్నుల్లోనే జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దాదాపు 80 శాతం షాపులు ఏకపక్షంగా జరిగాయని చెబుతున్నారు. మద్యం షాపులు దక్కించుకున్న సామాన్యులను బెదిరించి, బేరసారాలకు దిగారు. వైఎస్సార్ కడప జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు బరితెగించారు. ఓ వ్యక్తికి లాటరీలో మూడు షాపులు దక్కడంతో అతనిపై దౌర్జన్యం చేశారు. 50శాతం వాటా ఇస్తేనే షాపులు తెరుచుకుంటాయని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక శ్రీసత్యసాయి జిల్లాలోని రంగనాథ్ అనే వ్యక్తికి మద్యం షాపు దక్కగా.. అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించారు. ఇందులో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పీఏ హస్తం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతలే సిండికేట్ గా మారి షాపులు దక్కించుకున్నట్లు పలువురు వాపోతున్నారు. ఇందులో, పెద్దలకు 30 శాతం కమీషన్ పోయినట్లు తెలుస్తోంది.