తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఈ నిర్ణయానికి సభలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా ఇతర పార్టీలు మద్దతు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపిరికల్ డేటా ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా 42 శాతం రిజర్వేషన్‌ను చట్టబద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. రాజకీయాలను పక్కనపెట్టి, సామాజిక న్యాయం కోసం బీజేపీ, బీఆర్‌ఎస్, ఏఐఎం పార్టీలు కోర్టులో ఇంప్లీడ్ కావాలని పొన్నం కోరారు. సభలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఈ నిర్ణయానికి మద్దతు లభించినట్లు ఆయన తెలిపారు.