మన దేశంలో ఆల్కహాల్ వాడకం బాగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యపాన సేవనం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా పండుగల సమయంలో పీపాలకు పీపాలు తాగేస్తున్నారు మందుబాబులు. వీటి వల్ల సర్కారు ఖజానాకు డబ్బులు దండిగా వచ్చి చేరుతున్నాయి. ఆల్కహాల్ లవర్స్ పెరిగిపోవడం, మద్యం అమ్మకాలు భారీగా ఉండటంతో అనేక రకాల కొత్త బ్రాండ్లు పరిచయం అవుతున్నాయి. మన దగ్గర ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బ్రాండ్లకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. వీటిని రూ.వేలు, రూ.లక్షలు పోసి కొనే వాళ్లు ఉన్నారు. ఫారెన్ వైన్ బెస్ట్ చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ప్రపంచంలో అత్యుత్తమ విస్కీ మన దేశంలోనే దొరుకుతోందని తెలుసా? అవును, ఇది ముమ్మాటికీ నిజం.
ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, మాల్డోవా వంటి దేశాలకు చెందిన విస్కీకి మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ ఇవేవీ వరల్డ్ బెస్ట్ విస్కీ రేసులో నిలబడలేకపోయాయి. దునియాలోనే అత్యుత్తమ విస్కీగా ఇండియాలో తయారైన విస్కీ నిలిచింది. అదే ‘ఇంద్రి’ బ్రాండ్ విస్కీ. దీన్ని ది బెస్ట్ విస్కీగా విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అనే సంస్థ సెలెక్ట్ చేసింది. ఇంద్రి నుంచి విడుదలైన దీపావళి కలెక్టర్స్ ఎడిషన్-2023 ప్రపంచంలోని అతిపెద్ద విస్కీ టేస్టింగ్ పోటీల్లో ఒకటైన డబుల్ గోల్డ్ బెస్ట్ ఇన్ షో పురస్కారాన్ని అందుకుంది. ప్రతి ఏడాది ఈ అవార్డు కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న 100కు పైగా విస్కీ బ్రాండ్లు పోటీపడతాయి. అలాంటి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని భారతదేశానికి చెందిన ఇంద్రి బ్రాండ్ దక్కించుకోవడం విశేషం.
ఇంద్రి విస్కీ విషయానికొస్తే.. హర్యానాలోని పికాడల్లీ డిస్టిలరీస్ నుంచి వచ్చిన స్వదేశీ బ్రాండ్ ఇది. ట్రిపుల్ బ్యారెల్ సింగిల్ మాల్ట్ విస్కీ అయిన ఇంద్రి.. గత రెండేళ్లలో 14 కంటే ఎక్కువ ఇంటర్నేషనల్ అవార్డులు దక్కించుకుంది. ఫిఫ్టీ బెస్ట్ వరల్డ్ విస్కీస్ 2022 అవార్డు, స్పిరిట్స్ కాంపిటీషన్ 2023 పురస్కారం గెలుచుకున్న ఇంద్రి.. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యుత్తమంగా భావించే బెస్ట్ ఇన్ షో, డబుల్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. మన దేశంలోని 19 రాష్ట్రాలతో పాటు 17 ఇతర రాష్ట్రాల్లోనూ ఇంద్రి విస్కీ అందుబాటులో ఉంది. అమెరికా సహా కొన్ని యూరోపియన్ దేశాల్లో నవంబర్ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. రుచి, స్పర్శ, వాసన, దృష్టి, ధ్వని లాంటి ఐదు ఇంద్రియాల మీదుగా ఈ విస్కీకి ఇంద్రి అనే పేరు పెట్టారు.