దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తరించడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026 సోమవారం ఢిల్లీలో ప్రారంభం కానుంది. నవంబర్ 2 నుంచి 5 వరకు భారత్ మండపంలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి 130కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. 40 మందికి పైగా మంత్రులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు, పారిశ్రామిక రంగ ప్రముఖులు ఇందులో పాల్గొని స్వచ్ఛ ఇంధన రంగంలోని అవకాశాలు, సవాళ్లపై చర్చించనున్నారు. ఈ ఏడాది సదస్సుకు పెట్టుబడి పెట్టండి, ఆవిష్కరించండి, స్ఫూర్తినివ్వండి అనే నినాదాన్ని థీమ్‌గా ఎంపిక చేశారు.
ప్రపంచవ్యాప్తంగా సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. వివిధ దేశాల మధ్య సాంకేతిక భాగస్వామ్యాలు, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించేందుకు ఈ వేదిక దోహదపడనుంది. ఆస్ట్రేలియా, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు భాగస్వాములుగా పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు తమ దేశాల్లో అమలవుతున్న స్వచ్ఛ ఇంధన విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలు, అభివృద్ధి నమూనాలను ఈ సదస్సులో పంచుకోనున్నారు. వచ్చే నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన కీలక చర్చలకు భారత్ వేదిక కానుంది.

