జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను నిర్మూలించేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ మూడో రోజుకు చేరుకుంది. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో ఇప్పటి వరకు ఆరుగురు ముష్కరులను మట్టుపెట్టారు.. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు గాయపడ్డారు. ఆగస్టు 1న అఖల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు దాక్కున్నారన్న నిఘా సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు ప్రారంభించాయి. ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో ముష్కరులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతా దళాలు ప్రతిస్పందించాయి. శనివారం రోజంతా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. అదే సమయంలో ముష్కరుల దాడిలో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డాడు. ఇప్పటివరకు మట్టుబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందినవారని అధికారులు ధృవీకరించారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ఈ టీఆర్‌ఎఫ్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 26 మంది నిరపరాధ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా దళాల సమాచారం ప్రకారం, అఖల్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, అడవిలో దాక్కున్న మిగతా ముష్కరులను పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉగ్రవాదులు పూర్తిగా నిర్మూలించే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సంఘటనలతో కుల్గాం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులకు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.