గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ భవనం కూల్చివేతపై దాఖలైన ధిక్కార పిటిషన్ విచారణలో తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “చట్టబద్ధంగా నోటీసు ఇవ్వకుండా ఉదయాన్నే ఎందుకు కూల్చారు? హైడ్రాకు అపరిమిత అధికారాలు ఇస్తే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా నియంత్రించలేని పరిస్థితి వస్తుంది” అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికార పరిధి ఏమిటి? జీహెచ్ఎంసీ చట్టాలకు లోబడి పనిచేస్తుందా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తే జలవనరులు, నాలాల పరిరక్షణ తప్ప మిగతా విషయాల్లో జోక్యం చేసుకోకుండా నిషేధిస్తామని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి హెచ్చరించారు.

