జీఎస్టీ ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ పరిధిలోని సంస్థలు కచ్చితంగా పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో పన్ను చెల్లింపుదారుల సందేహాలు, అనుమానాల నివృత్తి కోసం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కాల్‌సెంటర్ నిర్వహణలో కృత్రిమ మేధ (AI) వినియోగాన్ని పరిశీలించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాలు అనుసరిస్తున్న పన్ను విధానాలను అధ్యయనం చేసి, అందులోని మేలైన విధానాలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన సేవలు అందేలా కార్యాలయాల్లో సౌకర్యాలను కల్పించాలని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.