గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాజాసింగ్ బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంమయ్యారు. అయితే పార్టీ అధిష్టానం రామచంద్రరావును అధ్యక్షుడిగా నియమించడంతో పాటు, రాష్ట్ర బీజేపీలోని పరిణామాలకు నిరసనగా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ హైకమాండ్ కు పంపించారు. శుక్రవారం బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ లేఖను విడుదల చేశారు. అయితే రాజాసింగ్ తదుపరి ఏ పార్టీలో చేరతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తన కార్యకర్తలు, అభిమానులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దని రాజాసింగ్ కోరారు.