తమిళనాడు ప్రభుత్వం హిజ్రా సముదాయం వ్యక్తులపై జరిగే దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ‘అరణ్’ (రక్షణ) పేరుతో వసతి గృహాలను ప్రవేశపెట్టింది. తొలి విడతలో చెన్నై మరియు మదురైలో రెండు గృహాలను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో అవసరాలను బట్టి ఈ గృహాల సంఖ్యను పెంచనున్నారు. ఒక్కో కేంద్రంలో 25 మంది ఉండేలా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సమాజంలో అభద్రతాభావం, వివక్ష, వెలివేత, వేధింపులకు గురైన హిజ్రాలు లేదా అనాథలుగా మిగిలినవారు గుర్తింపు కార్డు చూపించి ఈ గృహాల్లో ఉచిత వసతిని పొందవచ్చు. బాధితుల్లో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం కౌన్సెలింగ్ బృందాలను నియమించింది. ఈ గృహాల్లో ఆహారం, దుస్తులతో పాటు చదువుకునే సౌకర్యాన్ని సామాజిక సంక్షేమం మరియు మహిళా సాధికారత శాఖ కల్పిస్తోంది. అవసరమైన వారికి న్యాయ సాయం కూడా అందించనున్నారు. ఈ వసతి గృహాల్లో 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది.