హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసు నేడు నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రముఖ సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా, నిర్మాత సురేష్ బాబుపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు వీరిపై 448, 452, 458, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే విచారణకు హాజరుకావడంలో ఆలస్యం చేస్తూ వస్తున్నందుకు కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆగస్టు 1న తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా నేటి విచారణకు ఈ ముగ్గురు హాజరవుతారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. దీంతో కేసు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. నందకుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ స్థలంపై దగ్గుబాటి కుటుంబంతో వివాదం చెలరేగింది. సిటీ సివిల్ కోర్టులో కేసు నడుస్తుండగానే 2022 నవంబరులో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, బౌన్సర్ల సహాయంతో హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా 2024 జనవరిలో హోటల్‌ను పూర్తిగా కూల్చేశారు. ఈ నేపథ్యంలో నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించగా, దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనకు జరిగిన అన్యాయం పై నందకుమార్ ఎప్పటి నుంచో న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.