ఆస్కార్ వచ్చినా ఎమోషనల్ అవ్వలే.. వీడియో చూసి ఏడ్చేసిన కీరవాణి! ఏముందా వీడియోలో?
భారతీయ సినీ సంగీత దర్శకుల్లో ఎంఎం కీరవాణిది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ఫలానా తరహా కంపోజిషన్కే కట్టుబడి ఆయన మ్యూజిక్ ఏనాడూ సాగలేదు. కమర్షియల్ సినిమాలకు సంగీతం అందిస్తూనే భావప్రధానమైన శాస్త్రీయ సంగీతానికి అవకాశం ఉన్న చిత్రాలకూ ఆయన పనిచేశారు. భక్తిరస చిత్రాల్లో పాటలకు బాణీ కట్టడంతో ఈ తరంలో ఆయన్ను మించినోరు లేరు. ఇలాంటి సంగీతంతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. జానర్తో సంబంధం లేకుండా హిట్ బాణీ కట్టడంలో కీరవాణిది అందెవేసిన చేయి. అందుకే తెలుగువాళ్లు ఆయన్ను స్వరవాణి అంటే.. తమిళులు మరకతమణి అంటుంటారు. అంటే విలువైన వజ్రంతో ఆయన్ను పోలుస్తున్నారు. సంగీత ప్రపంచంలో ఆయన మరకతమణే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నాన్న శివ శక్తి దత్తా చూపిన దారిలోనే నడిచారు కీరవాణి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారో లేదో హిట్ పాటలతో ఇట్టే ఫేమస్ అయిపోయారు. సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ‘కలికి చిలకల కొలికి’, క్షణక్షణంలోని ‘జామురాతిరి జాబిలమ్మా’, క్రిమినల్లోని ‘తెలుసా మనసా’ పాటలు తెలుగు సినీ ప్రపంచంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వెన్నెల్లో ఆడపిల్ల ఆడుకున్నట్లు ఉంటాయి ఆయన పాటలు. బాణీ ఎంత మధురంగా ఉంటుందో అందులో వినిపించే వాయిద్యాలు, స్వరాలు కూడా అంతే అందంగా ఉంటాయి. ‘శుభసంకల్పం’, ‘మాతృదేవోభవ’ లాంటి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఆయనకు ఉన్నాయి. మెలోడీ సాంగ్స్తో పాటు ఎమోషన్ సాంగ్స్ చేయడంలోనూ ఆయన అంతే దిట్ట. ఇక, ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ లాంటి సినిమాలు కీరవాణి కెరీర్లో మైమర్చిపోని సినిమాలు. ఇందులోని పాటలు వింటే సాక్ష్యాత్తు దేవుడి ముందే ఉన్న అనుభూతి కలుగుతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సంగీత దర్శకుడిగా ఇన్ని హిట్లు, పేరు, హోదా, గౌరవం, డబ్బులు సంపాదించినా కీరవాణి ఇసుమంత కూడా మారలేదు. ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి చూసినవారు చెప్పేమాట ఇది. హడావుడిగా ఏ సినిమా పడితే అది చేసేయకుండా.. మనసుకు నచ్చిన కథలకు బాణీలను సమకూరుస్తూ పోతున్నారాయన. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆయనకు ఆస్కార్ను తెచ్చిపెట్టింది. ఆస్కార్ వచ్చినా ఆయన కించిత్ గర్వాన్ని ప్రదర్శించలేదు. ప్రపంచంలోనే ప్రఖ్యాత సినీ పురస్కారాన్ని అందుకున్నా ఆయన తన భావోద్వేగాలను బయటపెట్టలేదు. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్లోనూ కీరవాణి ప్రశాంతంగానే ఉన్నారు. అలాంటి కీరవాణి ఒక వీడియోను చూసి ఎమోషనల్ అయిపోయారు. ఆస్కార్ గెలిచినందుకు కీరవాణి, చంద్రబోస్తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ బృందాన్ని అమెరికన్ మ్యూజిక్ లెజెండ్ రిచర్డ్ కార్పెంటర్ అభినందించారు. వారిని మెచ్చుకుంటూ ‘టాప్ ఆఫ్ ది వరల్డ్..’ అనే గీతాన్ని పాడి వారికి పంపారు. దీంతో కీరవాణి ఉబ్బితబ్బిబ్బయ్యారు.
చిన్నప్పటి నుంచి రిచర్డ్ కార్పెంటర్ గీతాలంటే కీరవాణి చెవి కోసుకునేవారు. ఖాళీ దొరికితే చాలు.. రిచర్డ్ పాటలు వినేవారు. అలాంటి సంగీత దర్శకుడు రిచర్డే స్వయంగా తన కోసం పాట పాడటం అంటే ఇంకా కీరవాణి ఎలా స్పందించకుండా ఉంటారు. ఆస్కార్ అవార్డు అందుకున్నా భావోద్వేగాలు కనిపించకుండా జాగ్రత్తపడ్డ స్వరవాణి.. రిచర్డ్ పాటకు మాత్రం ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్లను ఆపుకోలేదాయన. ఈ విషయాన్ని రాజమౌళే తెలిపారు. అన్నయ్య కీరవాణి ఏడ్చేశారని జక్కన్న చెప్పారు. ఇది తనకు విశ్వం అందించిన అపురూప కానుక అని కీరవాణి చెప్పారు. దాన్నిబట్టే రిచర్డ్ అంటే ఆయనకు ఎంత ఇష్టం, గౌవరమో అర్థం చేసుకోవచ్చు.