మంచు మోహన్‌బాబు కుటుంబం ఈ మధ్య తరచూ గొడవలతో వార్తల్లో నిలుస్తోంది. కుటుంబమంతా రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. పోలీసులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఆ మధ్య ఏకంగా ఒకరిపై ఒకరు దాడికి కూడా పాల్పడ్డారు. ఇంట్లోకి రానివ్వడం లేదని ఒకరు… జనరేటర్‌లో పంచదార పోశారని మరొకరు.. ఇలా నానా రకరకాల రచ్చ జరిగింది. ఇప్పుడు కార్లు దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. మోహన్ బాబు కుటుంబంలో రచ్చ కాస్త తగ్గింది.. ఆయన ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారేమో అని అనుకుంటుండగా.. మంచు మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. సోదరుడు మంచు విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతోపాటు ఇతర వస్తువులను దొంగిలించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. జల్‌పల్లిలోని ఇంటిలో 150 మంది చొరబడి విధ్వంసం చేశారని, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకొని వెళ్లారు అనేది ఆ ఫిర్యాదు పూర్తి సారాంశం. అక్కడితో ఆగకుండా తన ఇంట్లో చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో ఉన్నాయని కూడా మనోజ్ చెప్పాడు. తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం రాజస్థాన్‌కి వెళ్లామని, తిరిగి ఇంటికి వచ్చి చూస్తే.. దొంగతనం జరిగింది అని మనోజ్ చెబుతున్నాడు. ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రితో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని మనోజ్ పోలీసుల్ని కోరాడు. ఇక దీనిపై మోహన్ బాబు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆయన ఏమని సమాధానం చెప్తారో వేచి చూడాలి.