ప్రభుత్వ బ్యాంకుల్లోని ఉన్నతస్థాయి పోస్టుల్లో 90 శాతం మంది ఆ కులాలవారే.. ఎందుకిలా?
మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారి కులాలేమిటన్న సమాచారాన్ని ‘ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ జనరల్ సెక్రటరీ జి.కరుణానిధి పొందారు. దీని ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్లో 90 శాతం మంది అగ్రకులాలకు చెందినవారేనని తేలింది. ఈ పోస్టుల్లో బీసీల ప్రాతినిధ్యం 2 నుంచి 3 శాతానికి మించి లేదు. దీనికి కారణాలేంటి? అసలు దీని వెనుక ఉన్న విషయాలు ఏంటనేది తెలుసుకుందాం..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ పదవుల్లో ఉన్నవారిలో 88 నుంచి 92 శాతం మంది జనరల్ కేటగిరీకి చెందినవారని వెల్లడైంది. ఇండియాలోని నేషనల్ బ్యాంకుల్లో 147 మంది చీఫ్ జనరల్ మేనేజర్లు ఉన్నారు. వారిలో 135 మంది జనరల్ కేటగిరీకి చెందినవారని తేలింది. ఇది దాదాపుగా 92 శాతానికి సమానం. మొత్తం 667 మంది జనరల్ మేనేజర్లు ఉండగా.. వారిలో 588 మంది అంటే సుఏమారుగా 88 శాతం జనరల్ కేటగిరీకి చెందినవారే కావడం గమనార్హం.
మండల్ కమిషన్ సిఫారసుల అమలు ఏమైనట్లు?
డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల్లో 81 శాతం జనరల్ కేటగిరీవాళ్లు. మిగిలిన 8 శాతం మంది బీసీలు ఉన్నారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల్లో 72 శాతం మంది జనరల్ కేటగిరీ, అలాగే 14 శాతం బీసీ వర్గాల వారు. చీఫ్ మేనేజర్లలో 61 శాతం మంది జనరల్ కేటగిరీలో వారు కాగా.. 19 శాతం మంది బీసీలు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఉండాలని మండల్ కమిషన్ సిఫారసు చేసింది. కానీ, కమిషన్ సిఫారసుల అమలు విషయంలో ఇందిర సహానీ కేసు సందర్భంలో సుప్రం కోర్టు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అవసరం లేదని ఆదేశించించడం తెలిసిందే. ఎస్సీలు, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు 5 ఏళ్ల వరకేనని నిర్ణయించారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పటికీ ప్రతి స్థాయిలో వారికి దక్కాల్సినన్ని రెగ్యులర్ పోస్టులు దక్కడం లేదని ‘ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ జనరల్ సెక్రటరీ జి.కరుణానిధి చెప్పారు. స్కేల్ 1, స్కేల్ 2 స్థాయిలో ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటున్నా.. ఆ మీద స్థాయి జాబ్స్కు వచ్చేసరికి వారి సంఖ్య తగ్గిపోతోందని కరుణానిధి పేర్కొన్నారు.
బ్యాంకులే కాదు.. అన్ని చోట్లా ఇదే పరిస్థితి!
‘తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్లు, సర్కారు ఉద్యోగాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కనిపిస్తారు. కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మాత్రం వారికి చాన్సులు చాలా తక్కువ. జనరల్ కేటగిరీలో వచ్చేవారిలో ఎక్కువగా అగ్రకులాలవారే ఉంటున్నారు’ అని కరుణానిధి చెప్పుకొచ్చారు. ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే కాదు.. పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు కాని ప్రతి దగ్గరా ఇదే పరిస్థితి ఉంటోందని, ఒక్క వర్గానిదే ఆధిపత్యం ఉంటోందని భారతీయ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య సంయుక్త కార్యదర్శి సీపీ కృష్ణ స్పష్టం చేశారు.