వైఎస్సార్ సీపీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నామినేషన్ దశలోనే అడ్డంకులు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన ధ్రువపత్రాలను అధికారులు సకాలంలో జారీ చేయకపోతే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతోనే కొందరు అధికారులు సర్టిఫికెట్ల జారీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కలెక్టర్ ను కలిసి సమస్యను వివరించామని, వెంటనే ధ్రువపత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వం ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుందని అంబటి రాంబాబు అన్నారు. సర్టిఫికెట్ల పేరుతో నామినేషన్లను తిరస్కరిస్తే ప్రజా ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.
తాడేపల్లిలో వైఎస్సార్ సీపీ కార్యాలయం కోసం తమ ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూమి విషయంలో కూడా అంబటి రాంబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కార్యాలయ నిర్మాణం పూర్తయ్యే దశలో ప్రస్తుత ప్రభుత్వం భవనాన్ని కూల్చివేసిందని ఆయన ఆరోపించారు. కోర్టు నోటీసుల విషయంలో కూడా అధికారులు స్పందించలేదని, తాజాగా ఆ భూమిని వెనక్కి తీసుకునేందుకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. స్మశానవాటిక కోసం భూమిని స్వాధీనం చేసుకుంటామని నోటీసులో పేర్కొన్నట్లు చెప్పారు. మరోవైపు చంద్రబాబు నివాసానికి సంబంధించిన అనుమతులపై తాము ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ, ఆయన కోర్టును ఆశ్రయించి ఇంటి కూల్చివేతను నిలిపివేయించుకున్నారని అంబటి విమర్శించారు. ఈ రెండు అంశాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

