గతంలో మావోయిస్టులకు స్థావరంగా ఉన్న కర్రె గుట్టల ప్రాంతం ఇప్పటికీ సురక్షితం కాదని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మావోయిస్టులు పాతిపెట్టిన భారీ పేలుడు పదార్థాలు మరియు ల్యాండ్ మైన్లను సీఆర్పీఎఫ్ మరియు ఛత్తీస్ గఢ్ డీఆర్జీ బలగాల సమన్వయంతో వెలికితీసి నిర్వీర్యం చేసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఆ ప్రాంతంలోకి పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదని ల్యాండ్ మైన్ల తొలగింపు పూర్తయిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
సోమవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనజీవన స్రవంతిలో కలిసిన 214 మంది మావోయిస్టులకు పునరావాసం కింద 5 కోట్ల 59 లక్షల రూపాయల రివార్డు చెక్కులను ఆయన అందజేశారు. కర్రె గుట్టల్లో ఇప్పటివరకు తొమ్మిది ఆయుధాల డంపులను గుర్తించామని వెల్లడించారు. 2024 జనవరి నుంచి తెలంగాణలో ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ పేర్కొన్నారు.

