నేపాల్ దేశంలోని తూర్పు ప్రాంతమైన కోశి ప్రావిన్స్ లో మంగళవారం ఉదయం 5.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల 17 నిమిషాలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం తప్లేజంగ్ జిల్లాలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ గుర్తించింది. సిక్కింలోని గేజింగ్ ప్రాంతానికి 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఈ భూకంప ప్రభావం భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలపైనా పడింది. సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ మరియు మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు స్పష్టం చేశారు.

