Monday, October 5, 2026

బుర్రిపాలెం సభలో అపశ్రుతులు.. నాదెండ్ల‌కు అవ‌మానం

Must Read

బుర్రిపాలెం: రూరల్‌ మండలం బుర్రిపాలెంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభలో పలు అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభా వేదికపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చిత్రాన్ని ఏర్పాటు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.సభా వేదికపై ప్రొటోకాల్‌ ప్రకారం మంత్రి ఫొటో లేకపోవడాన్ని జనసేన నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు స్పందించి కొంత సమయం తర్వాత మంత్రి మనోహర్‌ చిత్రాన్ని వేదికపై ఏర్పాటు చేసిన డిజిటల్‌ స్క్రీన్‌పై ప్రదర్శించారు.

హెలీప్యాడ్‌ వద్ద ఆంక్షలు

ముఖ్యమంత్రి హెలీకాప్టర్‌ దిగే హెలీప్యాడ్‌ ప్రాంతానికి వెళ్లేందుకు స్థానిక రైతులు, టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చాలాసేపు వేచి చూసినప్పటికీ అనుమతి లభించకపోవడంతో వారు వెనుదిరిగారు.ఒక టీడీపీ మహిళా నాయకురాలు పలుమార్లు హెలీప్యాడ్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదు. ఈ వ్యవహారంపై ఆమె సీనియర్‌ నాయకుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. హెలీప్యాడ్‌ వద్ద పరిమిత సంఖ్యలోనే వ్యక్తులకు అనుమతి ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయడంతో భద్రతా సిబ్బంది వారిని వెనక్కి పంపించారు. ఈ క్రమంలో జనసేనకు చెందిన కొందరు నాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.

ఆలస్యంగా సీఎం ప్రసంగం

మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో బుర్రిపాలెంలో త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు.అయితే ఒంటి గంట దాటినా ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాకపోవడంతో సభకు వచ్చిన కొంతమంది ప్రజలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. గ్యాలరీల వద్ద విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఎండ, ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు

సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో ప్రాంగణంలో రద్దీ పెరిగింది. మరోవైపు తీవ్ర ఎండ, ఉక్కపోత కారణంగా సభికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆలస్యం కావడంతో చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. సభ ముగిసిన అనంతరం ప్రజలు భారీగా బయటకు తరలివచ్చారు. మొత్తంగా ప్రొటోకాల్‌ అంశం, హెలీప్యాడ్‌ వద్ద ఆంక్షలు, సీఎం ప్రసంగంలో జాప్యం, ఎండ-ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు బుర్రిపాలెం సభలో చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

అలిపిరి నడక మార్గంలో చిరుత కలకలం

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. మోకాలి మిట్ట ప్రాంతంలో వేకువజామున సుమారు రెండు గంటల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -