ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. జర్మనీలో జరిగిన మ్యూనిచ్ లీడర్స్ సమావేశంలో మాట్లాడిన ఆమె.. కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో ఏర్పడుతున్న అంతరాయాలు భవిష్యత్తులో ప్రపంచ ఆహార సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి, బాబ్ అల్-మండేబ్ వంటి ప్రధాన సముద్ర మార్గాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే ఆ ప్రభావం కేవలం ఇంధన సరఫరాకే పరిమితం కాదని ఆమె వివరించారు. ఎరువులు, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన సరఫరా వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.
మలక్కా జలసంధిపైనా ఆందోళన
మలక్కా జలసంధి ప్రస్తుతం ఎలాంటి పెద్ద సమస్యను ఎదుర్కోవడం లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే భవిష్యత్తులో అక్కడ కూడా రవాణా మార్గాలకు ఆటంకం ఏర్పడితే ప్రపంచ సరఫరా వ్యవస్థపై మరింత తీవ్రమైన ఒత్తిడి పడే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్ర రవాణాలో ఎదురవుతున్న సవాళ్లు ఇప్పటికే ఎరువుల దిగుమతులపై ప్రభావం చూపుతున్నాయని ఆమె వెల్లడించారు. షిప్పింగ్ ఖర్చులు, బీమా ప్రీమియంల పెరుగుదలతో పాటు నౌకల లభ్యత తగ్గడం కూడా దిగుమతిదారులకు సమస్యగా మారిందని పేర్కొన్నారు.
ఎరువుల సరఫరాకు భారత్ చర్యలు
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశ వ్యవసాయ రంగంపై పడకుండా భారత్ ముందస్తు చర్యలు చేపడుతోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఎరువుల రవాణా చేసే షిప్పింగ్ సంస్థలకు ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేకంగా షిప్పింగ్ ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే సమయంలో దేశీయంగా యూరియా, ఫాస్ఫేట్ ఎరువుల ఉత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం అవసరమవుతుందని స్పష్టం చేశారు.
భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై కీలక వ్యాఖ్యలు
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చర్చలపైనా నిర్మలా సీతారామన్ స్పందించారు. చర్చలు ప్రస్తుతం ఇరు దేశాలు పరస్పరం మరింతగా ఇచ్చిపుచ్చుకోవడం అంత సులభం కాని దశకు చేరుకున్నాయని ఆమె తెలిపారు. అమెరికా తన వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు ప్రస్తుత చర్చల పరిధికి భిన్నమైన మార్గాలను కూడా పరిశీలిస్తోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

