ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఇదే నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై భారం పడకుండా రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించుకోవాలి అని బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఎల్పీజీ, పెట్రోలు, డీజిల్ నిల్వలపై తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు హైదరాబాద్‌లోని సీజీఐ టవర్స్‌లో కిషన్‌రెడ్డి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ గ్యాస్ సమస్యలపై వస్తున్న వదంతులను ప్రస్థావించారు.
వ్యాట్ ఎందుకు తగ్గించరు : పెట్రోలు, డీజిల్‌పై దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం వ్యాట్ విధిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గత పన్నెండేళ్లగా ఇది 35.20 శాతంగా ఉంటోందని తెలిపారు. గతంలో పాలించిన కేసీఆర్ ప్రజాపాలన అంటూ డప్పు కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ దీనిలో ఒక్కపైసా కూడా వ్యాట్‌ను తగ్గించలేదని వెల్లడించారు. మన పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 31 శాతంగా విధిస్తుండగా, మహారాష్ట్రలో 26 శాతం, కర్ణాటకలో 29 శాతంగా ఉన్నాయని ప్రస్థావించారు. అయితే తెలంగాణలో మాత్రం ఎందుకని 35.20 శాతం విధిస్తున్నారు? దీనిని ఎందు తగ్గించండం లేదు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.



