మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. “సిగాచి పేలుడు బాధితులకు రూ. కోటి రూపాయల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇచ్చింది కేవలం 26 లక్షలు మాత్రమే. మిగతా 74 లక్షలు ఎక్కడ? ఇది మాట తప్పడం కాదా?” అని ప్రశ్నించారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను పరిహారంలో చూపి చికిత్స ఖర్చులు కోత విధించడం అమానవీయమని, ఆచూకీ లేని 8 మందికి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం సిగాచి యాజమాన్యానికి ఏజెంట్‌లా మారింది. హైకోర్టు మొట్టికాయలు వేసినా యాజమాన్యాన్ని అరెస్టు చేయడం లేదు. కేంద్రం ఇచ్చిన రూ.2 లక్షలు కూడా ఇప్పించే స్థోమత లేదా? తక్షణమే కోటి రూపాయలు చెల్లించకపోతే బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది” అని హెచ్చరించారు.

