తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన వివాదంపై క్షమాపణలు చెప్పారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత, అధికారులను బయటకు పంపి, మంత్రులతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంటన్నర సేపు రాజకీయ అంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ, తన శాఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం, కూతురు ఆరోపణలపై స్పందించారు. పోలీసులు తమ ఇంటికి రావడంతో కూతురు ఆవేశంలో ముఖ్యమంత్రిపై మాట్లాడినట్లు చెప్పారు. “మా కుటుంబంలో అపార్థం వచ్చింది. అందరం కలిసి ముందుకు వెళ్తాం. నా కూతురు ఆవేశంలో మాట్లాడినందుకు సీఎంకు క్షమాపణలు చెప్పాను,” అని సురేఖ తెలిపారు. పార్టీలో విభేదాలు సర్దుబాటు చేసుకున్నామని, ఇకపై ఐక్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

