విజయదశమి పర్వదినంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంఘ్ సిద్ధమవుతోంది. ఆగస్టు 26 నుంచి 28 వరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాలతో శతాబ్దీ వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఉపన్యాసాల పరంపరను ప్రారంభించనున్నారు. సంఘ్ ప్రస్థానం, సమాజంపై దాని ప్రభావం, భవిష్యత్తు దిశపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఇప్పటికే క్రీడలు, కళలు, మీడియా, స్టార్టప్‌లు, న్యాయవాదులు, అధికారులు, ఆలోచనాపరులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు వంటి విభిన్న రంగాల నుంచి సుమారు 2000 మందికి పైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా ఆహ్వానించడం విశేషం. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు వంటి మైనారిటీ వర్గాలకూ ఆహ్వానం పంపినట్టు సంఘ్ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 26న జరిగిన చర్చల్లో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రయాణంపై సమీక్ష ఉంటే, రెండవ రోజు భవిష్యత్తు దృక్కోణంపై చర్చ, మూడవ రోజు మోహన్ భగవత్‌తో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉండనుంది.