ప్రైవేట్ రంగంలోని డ్రైవర్లకు ఇచ్చే రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు రేవంత్ రెడ్డి ఆకర్షణీయ హామీలు ఇచ్చినా, గద్దెనెక్కాక ఉన్న పథకాలనే రద్దు చేసి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వం మానవీయ కోణంతో ప్రారంభించిన డ్రైవర్ల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ 2024 నుండి నిలిపివేసిందని, దీంతో ప్రమాదాల్లో మరణించిన అనేకమంది డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఎగ్గొట్టి పథకాన్ని మూసేయడం పేదలకు పెద్ద దెబ్బగా మారిందని ఆయన విమర్శించారు.
రేవంత్ పాలనపై విమర్శలు
రైతు బీమా, నేతన్నకు బీమా, డ్రైవర్లకు బీమా వంటి పథకాల ద్వారా సబ్బండ వర్ణాల ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించిన కేసీఆర్ ప్రభుత్వం, ఒక్కో పథకానికి మంగళం పాడి పేద కుటుంబాలను అగమ్యగోచర స్థితిలోకి నెట్టేస్తోందని కేటీఆర్ విమర్శించారు. డ్రైవర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని క్లెయింలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డ్రైవర్ల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ఈ “అమానవీయ సర్కార్”ను వెనక్కి తగ్గించే వరకు పోరాడతామని హెచ్చరించారు.