బీసీ బిల్లు అవసరాన్ని దేశానికి చాటి చెప్పేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆగస్టు 4 నుంచి 6 వరకు 72 గంటల దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. కవిత నేడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా బీసీ గళం వినిపిస్తున్న కవిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. కవిత మాట్లాడుతూ.. బీసీల హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడమే తన దీక్ష ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే దీక్ష చేస్తానని, ఒకవేళ అనుమతి నిరాకరిస్తే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహార దీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం తాను చేసిన 72 గంటల దీక్షతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి బీసీ బిల్లును ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. బిహార్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ధర్నా డ్రామా చేస్తోందని మండిపడ్డారు. బీసీల సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ అనవసర విషయాలతో కాలక్షేపం చేస్తూ, తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2018 పంచాయతీ రాజ్ సవరణ చట్టంపై జాగృతి చేసిన డిమాండ్‌తోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని తెలిపారు. తమిళనాడులో గవర్నర్ జాప్యం చేసినప్పుడు అక్కడి ప్రభుత్వం కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకుందని, మరి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఒప్పందం కారణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేసే ధర్నాకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారని, ఇది ఏమైనా సత్రం భోజనమా? అని కవిత ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, అందుకు సంబంధించి అన్ని పార్టీలకు లేఖలు రాయాలని డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో పనికి రాని విషయాలపై రాజకీయాలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. బీసీ బిల్లుకు మద్దతు తెలిపే ప్రతి పార్టీ, ప్రతి నేత తన దీక్షకు తోడ్పాటునివ్వాలని పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.