ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్యవర్తిగా వ్యవహరించిన ఈ భేటీ శాంతియుతంగా కొనసాగింది. పలు వివాదాస్పద ప్రాజెక్టుల విషయాలను, వాటి నిర్వహణ బాధ్యతలపై క్లారిటీ కోసం ఈ చర్చలు చేపట్టినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం ద్వారా నీటి వనరుల సమర్థవంతమైన వినియోగానికి దారి తీయాలని కేంద్రం ఆశిస్తోంది.