బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో జరగబోయే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంల సమావేశంలో బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించాలని ఏపీ ముందుగా పంపిన సింగిల్ ఎజెండా ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉదయం కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన తాజా లేఖలో, బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ, సెంట్రల్ వాటర్ కమిషన్, ఈఏసీ సంస్థల అభ్యంతరాలను ప్రస్తావిస్తూ, ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంది. అంతేకాక, గతంలోనే కేంద్రానికి పంపిన తమ ఎజెండాలో తెలంగాణ ప్రధానంగా కృష్ణా నది మీద పెండింగ్‌లో ఉన్న అనుమతులు, పాలమూరు –రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కోసం 80 టీఎంసీల నీటి కేటాయింపు, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద నీటి వినియోగం కోసం కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన వంటి అంశాలను చర్చకు ఎత్తినట్లు వివరించింది. గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటమంటే కేంద్ర నియంత్రణ సంస్థల నిబంధనలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించడమేనని తెలంగాణ అభిప్రాయపడింది. ఈ తరహా చర్చల వల్ల జలపరిపాలనకు సంబంధించిన సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుందని కూడా లేఖలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రేపటి సీఎంల సమావేశంలో బనకచర్ల అంశం చర్చకు వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి వివాదం మరింత ముదురే అవకాశం కనిపిస్తోంది.