తెలంగాణలో పేపర్ లీకేజీ ప్రకంపనలు
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు..
విపక్షాల ఆందోళనలు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకేజీ ప్రకంపనలు సృష్టిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం టీఎస్‌పీఎస్‌సీ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సిట్ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కమిషన్ తాజా నిర్ణయంపై గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఆ ఫలితాలను జనవరి 13వ తేదీ (శుక్రవారం) టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 503 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది. ఈలోపే లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపడంతో.. ఇప్పుడు అదే జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది.
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేయడంతో విపక్షాలు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నించింది. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో ఎన్‌ఎస్‌యూఐ నేతలు వాగ్వాదానికి దిగారు.
అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘‘ఛలో టీఎస్పీఎస్సీ’’ పిలుపు మేరకు గన్‌పార్క్ అట్టుడికింది. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వాస్తవం, గూడుపుఠాణి జరిగిన మాట నిజం, దీనిపై స్పందించాల్సిన సీఎం నోరు మెదపడం లేదంటూ బండి సంజయ్ మండిపడ్డారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ల కుటుంబాలు పేపర్ లీకేజీతో అల్లాడుతుంటే దొంగ సారా దందా చేసిన లిక్కర్ క్వీన్ ను కాపాడుకునేందుకు కెబినెట్ అంతా ఢిల్లీ వెళతారా? మంత్రులకు సిగ్గు లేదా? నిరుద్యోగుల కంటే కేసీఆర్ బిడ్డే మీకు ముఖ్యమా? అంటూ బండి ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో నీళ్లు-నిధులు-నియామకాల్లోనూ అక్రమాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్సీస్సీ ఛైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించి ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని , మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. మొత్తానికి పేపర్ లీకేజీ వ్యవహారంతో రాష్ట్రం అట్టుడికింది.