జూన్‌లో జగన్ వైజాగ్ షిప్ట్!
మంత్రులకు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి
రాజధాని తరలింపులో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వైజాగ్ షిఫ్ట్ అవుతున్నట్లు మంత్రులకు సీఎం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. రేపు(బుధవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. బడ్జెట్ సెషన్ కావడంతో శని, ఆదివారాల్లోనూ(18,19) సమావేశాలు కొనసాగుతాయి. 21, 22 అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించారు.
కాగా, ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని తరలింపుపై సీఎం వైయస్ జగన్ మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. జూన్‌లో తాను వైజాగ్ షిఫ్ట్ అవుతానని చెప్పినట్లు సమాచారం. ఉద్యోగులకు కూడా జూన్ నెల అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకొని జూన్‌లో అయితే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేబినెట్ సమావేశంలో సీఎం మంత్రులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మంత్రులు ఎవరేం చేస్తున్నారో.. అందరి పనితీరు గమనిస్తున్నాను. తేడాలొస్తే మంత్రులను మార్చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యతలను మంత్రులకు సీఎం కట్టబెట్టారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను ఆయన అప్పగించారు.
మంత్రుల తీరు బాగాలేకపోతే ఇద్దరు ముగ్గుర్ని పదవుల నుంచి తప్పించడానికి కూడా ఏ మాత్రం వెనకాడనని సీఎం తేల్చిచెప్పేశారట. స్వయంగా సీఎం జగనే ఈ కామెంట్స్ చేయడంతో మంత్రుల్లో టెన్షన్ మొదలైందట. దీంతో కేబినెట్ నుంచి ఎవర్ని తొలగిస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందట. అంతేకాదు.. శాఖాపరంగా, పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు కూడా ఉంటాయని ఇంకొందరు మంత్రులను జగన్ పరోక్షంగా హెచ్చరించారట. అయితే జగన్ ఎవరెవర్ని మంత్రి పదవుల్లో నుంచి తొలగిస్తారు..? ఎవరెవరి శాఖలు మారుస్తారనే దానిపై మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఆ ముగ్గురిలో ఇద్దరు కోస్తా జిల్లాకు చెందిన వారుకాగా.. మరొకరు రాయలసీమకు చెందినవారని తెలుస్తోంది. ఆ ముగ్గురు మంత్రుల స్థానంలో ముగ్గుర్ని ఎమ్మెల్సీలను కేబినెట్‌లోకి తీసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గుంటూరు జిల్లా నుంచి ఒకరు, కృష్ణ జిల్లా నుంచి మరోకరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.