Thursday, November 21, 2024

పంచ్‌కు పతకాలు దాసోహం.. అసలు ఎవరీ నిఖత్ జరీన్? ఆమె స్టోరీ ఏంటి?

Must Read

పంచ్‌కు పతకాలు దాసోహం.. అసలు ఎవరీ నిఖత్ జరీన్? ఆమె స్టోరీ ఏంటి?

ప్రపంచ యవనికపై భారత జెండా మరోసారి రెపరెపలాడింది. ఆటల్లో మరోమారు మన సత్తా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. విమెన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ మరో గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ప్రత్యర్థి, రెండుసార్లు ఆసియా ఛాంపియన్ షిప్ నెగ్గిన వియత్నాంకు చెందిన న్యూయెన్ టాన్ మీద 5-0 తేడాతో విక్టరీ సాధించింది. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి అదరగొట్టింది నిఖత్.

దిగ్గర మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు వరల్డ్ టైటిల్ గెలిచిన రెండో భారత బాక్సర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది నిఖత్. గతేడాది 52 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్న నిఖత్.. ఈసారి 50 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. అలాంటి నిఖత్ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

మహ్మద్ జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు జూన్ 14వ తేదీ 1996లో నిఖత్ జరీన్ జన్మించింది. నిజామాబాద్ ఆమె సొంతూరు. ఇంట్లో పిల్లల్లో నిఖత్ వయసులో అందరికంటే చిన్న. నిర్మలా హృదయా గర్ల్స్ హై స్కూల్ లో ఆమె తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. హైదరాబాద్ లోని ఏవీ కాలేజీలో నిఖత్ డిగ్రీ చదువుతోంది. బాక్సింగ్ లో భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శనలు చేసినందుకు గానూ నిఖత్ కు బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలిచి ఉద్యోగం ఇచ్చింది. అక్కడ ఆమె స్టాఫ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తోంది.

తండ్రే తొలి గురువు

స్పోర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి నిఖత్ జరీన్ కు మక్కువ ఎక్కువ. తన అన్నలతో కలసి ఆమె విభిన్నమైన ఆటలు ఆడేది. తను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే బాక్సింగ్ ఆడటం మొదలుపెట్టింది. బాక్సింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఆ ఆటలో తాను ఏదో ఒకటి సాధించగలదని ఆమె తండ్రి జమీల్ అహ్మద్ గ్రహించారు. బాక్సింగ్ లో నిఖత్ తొలి గురువు ఆమె నాన్న జమీల్ అహ్మదే. కూతురికి పంచ్ ఎలా విసరాలో దగ్గర నుంచి ప్రత్యర్థిని ఎలా పడగొట్టాలో వరకు అన్నీ ఆయనే దగ్గర ఉండి ట్రైనింగ్ ఇచ్చారు. నాన్న దగ్గర ఒక ఏడాది పాటు బాక్సింగ్ పాఠాలు నేర్చుకున్నాక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ఎంపికైంది నిఖత్.

‘సాయ్’ కీలక పాత్ర

సాయ్ లో ప్రముఖ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఐవీ రావు శిక్షణలో నిఖత్ రాటుదేలింది. అలాగే ఎన్.లింగయ్య కూడా ఆమెకు హై లెవల్లో ట్రైనింగ్ ఇచ్చారు. 2010లో జరిగిన నేషనల్స్ లో అద్భుత ప్రదర్శనకు గానూ నిఖత్ ను ‘గోల్డెన్ బెస్ట్ బాక్సర్’గా ప్రకటించారు. ఆ తర్వాత 2011లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్ షిప్ ను ఆమె దక్కించుకుంది. అక్కడి నుంచి ఆమె విజయాల పరంపర మొదలైంది.

బరిలోకి దిగితే మెడల్ పక్కా

సెర్బియాలో 2013లో నిర్వహించిన నేషనల్ కప్ ను నిఖత్ జరీన్ కైవసం చేసుకుంది. 2014లో నేషన్స్ కప్ లో గోల్డ్ మెడల్, 2015లో జాతీయ సీనియర్ ఛాంపియన్ షిప్ లోనూ గోల్డ్ మెడల్, ఆ తర్వాత 2017లో ఆసియా మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆమె కాంస్య పతకం సొంతం చేసుకుంది. 2018లో సెర్బియాలోని బెల్ గ్రేడ్ లో నిర్వహించిన టోర్నీలో గోల్డ్ మెడల్, 2019లో థాయ్ లాండ్ ఓపెన్ లో సిల్వర్ మెడల్ ను నిఖత్ కైవసం చేసుకుంది. 2022 నిఖత్ కు బాగా కలిసొచ్చింది. ఆ ఏడాది టర్కీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ ను దక్కించుకున్న నిఖత్.. అదే ఏడాది జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లోనూ పసిడితో మెరిసింది.

మేరీకోమ్ మెచ్చుకోలు

నిఖత్ బాక్సింగ్ కెరీర్ లో కీలకమైన మ్యాచ్ ఏదైనా ఉందంటే అది 2019లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ ట్రయల్ బౌట్ మ్యాచ్. ఆ ఒలింపిక్స్ లో భారత్ తరఫున 51 కిలోల విభాగంలో ఆడే బాక్సర్ ఎవరో తేల్చేందుకు ట్రయల్ బౌట్ నిర్వహించారు. అందులో భాగంగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్, స్టార్ బాక్సర్ మేరీకోమ్ తో తలపడింది నిఖత్. ఆ మ్యాచ్ లో నిఖత్ ఓడిపోయినప్పటికీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అలాగే మేరీకోమ్ ప్రశంసలను కూడా అందుకుంది.

పంచ్ పవర్‌తో దునియాను శాసిస్తోంది

గత రెండేళ్లుగా నిఖత్ జరీన్ కు ఎదురే లేకుండా పోయింది. తాను ఆడిన దాదాపుగా ప్రతి మేజర్ టోర్నీలోనూ ఏదో ఒక మెడల్ నెగ్గుతూ వస్తోంది. వరుసగా రెండు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచింది. తెలంగాణలోని ఓ సాదాసీదా పట్టణం నుంచి, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నిఖత్ జరీన్.. ఇవ్వాళ బాక్సింగ్ ప్రపంచాన్ని తన పంచ్ పవర్ తో శాసిస్తోంది. క్రీడల్లోనే కాదు ఏదైనా రంగంలో రాణించాలని కోరుకునే ఎందరో అమ్మాయిలకు నిఖత్ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక, బాక్సింగ్ ను కెరీర్ గా ఎంచుకోవాలని భావించే వారికైతే తనో రోల్ మోడల్ అని చెప్పకతప్పదు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -