కవిత మాస్టర్ స్కెచ్.. ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయేలా..!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఫేమస్ అయిపోయారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యేందుకు హస్తినకు చేరుకున్న కవిత మాస్టర్ స్కెచ్ చూసి జాతీయ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. దేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సహా తమను ఎదిరించిన ప్రతి ప్రత్యర్థి పార్టీని బీజేపీ భయపెట్టిస్తున్న వేళ.. కవిత తన వ్యూహాత్మకత ఎత్తుగడతో షాక్‌కు గురి చేసింది.
ఈడీ విచారణ కోసం కవిత ఢిల్లీకి వస్తున్నారంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు సహా పార్టీ శ్రేణులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హస్తినకు చేరుకున్నారు. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసినప్పుడు కూడా అక్కడ అంత హడావుడి లేదు. మనీష్ జైలుకు వెళ్లగానే ఆయన స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించేశారు కేజ్రీవాల్. బీజేపీని విమర్శించే చాన్స్ వచ్చినా దాన్ని వాడుకోలేదు.
బలప్రదర్శనతో కేంద్రానికి సవాల్!
కవిత మాత్రం అలా కాదు. తనకు వచ్చిన చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు. ఆమెను ఈడీ విచారణకు పిలిచిన సమయంలోనే విమెన్స్ డే ఉండటంతో మహిళల రిజర్వేషన్ బిల్లుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆమె నిరసనకు దిగారు. దీంతో అందరి చూపు అటు వైపు మళ్లింది. అదే సమయంలో పార్టీ నేతలు, మద్దతుదారులు ఢిల్లీకి తరలిరావడంతో తన బలం ఏంటో కేంద్రానికి చూపించకనే చూపించారు. మందీమార్బలంతో ఒకరకంగా ఆమె బలప్రదర్శనకు దిగారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీకి పయనమవ్వడం కూడా చూస్తున్నాం.
బండి వ్యాఖ్యలపై దుమారం!
ఒకవేళ కవితను అరెస్ట్ చేసినా అందుకు సిద్ధంగా ఉండేలా ముందే ప్లాన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ లాయర్ల బృందం హస్తినకు చేరుకుందని సమాచారం. కవితను రేపు అరెస్ట్ చేయొచ్చంటూ కేసీఆర్ నిన్న చెప్పారు. తద్వారా ప్రజల్లో సానుభూతి పొందే ప్లాన్ చేశారని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు బండి సంజయ్ లాంటి రాష్ట్ర బీజేపీ ముఖ్య నేత ‘కవితను అరెస్ట్ చేయకుంటే.. ముద్దు పెట్టుకుంటారా’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని తమ మీదే రివల్స్ కామెంట్స్ వేసేలా చాన్స్ ఇస్తున్నారు. మొత్తానికి కవిత స్కెచ్‌కు అందరూ షాక్ అవుతున్నారు.