మోడర్న్ టెక్నాలజీ రోజురోజుకీ మరింత కొత్తపుంతలు తొక్కుతోంది. ఏటేటా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. అయితే ఏఐని కొందరు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఒరిజినల్ కు, డుప్లికేట్ కు తేడా తెలియనంతగా ఫొటోలు, వీడియోలను మార్చేస్తున్నారు. ఆఖరికి గొంతులు కూడా ఏమారుస్తున్నారు. దీన్నే ‘డీప్ ఫేక్’గా పిలుస్తున్నారు. ఈ తరహా మోసాలు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. అసలును నకిలీగా మార్చేసి.. అసలుకే ఎసరు తెస్తున్నారు మోసగాళ్లు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన పర్సనల్ ఫొటోలు, వీడియోలను అసభ్యంగా మార్చేసి ఆ వ్యక్తుల పరువును డీప్ ఫేక్ టెక్నాలజీతో సైబర్ మాయగాళ్లు బజారుకీడుస్తున్నారు. పుల్ డ్రెస్ లో దిగిన ఫొటోలనూ నగ్నంగా మార్చేస్తున్నారు.
డీప్ ఫేక్స్ సాయంతో పాతికేళ్ల మనిషిని అరవై ఏళ్ల వ్యక్తిగా చూపిస్తున్నారు. మామూలు వీడియోలను కూడా అసభ్యంగా మార్చి, దాని ఆధారంగా వారిని ఊహించని ప్రమాదాల్లోకి నెడుతున్నారు. డీప్ ఫేక్స్ వలలో ఎంతో మంది అమాయకులు చిక్కుకుంటున్నారు. అయితే ఇలా తమ వలలో చిక్కిన వారిని స్కామర్లు అంత తేలిగ్గా వదిలిపెట్టరు. వాళ్ల ప్రొఫైల్ ను వాడుకొని, వారి ఫ్రెండ్స్ కు ఆ వ్యక్తే పంపినట్లుగా మెసేజ్లు సెండ్ చేస్తారు. అర్జెంటుగా డబ్బులు కావాలని అడుగుతారు. డబ్బులు పోయాయని, ప్రమాదంలో ఉన్నానని ఏవేవో కారణాలు చెబుతారు. అయితే పర్సనల్ గా ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే గానీ అలా అడిగింది అసలు వ్యక్తో, నకిలీ వ్యక్తో తెలియదు. కొన్ని ఏఐ టూల్స్, అధికారిక వెబ్ సైట్ల నుంచి ఎమర్జెన్సీ మెయిల్స్, మెసేజెస్ పంపుతుంటారు. వీటని నిజమని నమ్మితే బోల్తాపడినట్లే!
ఈ డీప్ ఫేక్స్ వల్ల భౌగోళిక రాజకీయాలకు కూడా ముప్పు ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఫ్రాడ్ స్టర్స్ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక దేశంతో మరో దేశానికి ఉన్న స్నేహసంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇటీవల న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చిన జీ20 డిక్లరేషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై చర్చ జరిగింది. ఈ టెక్నాలజీ దుర్వినియోగం వల్ల ప్రపంచ దేశాలకు ఏర్పడే ముప్పు మీదా డిస్కషన్ జరింది. డీప్ ఫేక్స్ టెక్నాలజీ వల్ల ఎన్నికల్లో విజేతలను కూడా నిర్ణయించొచ్చని యూరోపోల్ అనే సంస్థ తెలిపింది. ఎలక్షన్లను పరోక్షంగా ప్రభావితం చేసే సత్తా దీనికి ఉందని పేర్కొంది. ఈ టెక్నాలజీ వల్ల ఫైనాన్షియల్ మార్కెట్లకూ సమస్య పొంచి ఉందని చెప్పింది. కంపెనీల స్టాక్ రేట్ పెంచడం, తగ్గించడం లాంటివి డీప్ ఫేక్ ద్వారా పాజిబుల్ అని వివరించింది. మరి.. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ప్రమాదాన్ని నివారించడానికి ఏదైనా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తారో లేదో చూడాలి.