తెలంగాణకు చెందిన కంపెనీలతో ఒప్పందానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లాలా అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చురకలంటించారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డుకు అటు వైపు రేవంత్ రెడ్డి ఉంటారని.. ఇటు వైపు మెగా కృష్ణారెడ్డి ఉంటారని వ్యాఖ్యానించారు. మెగా కృష్ణారెడ్డి కంపెనీతో ఒప్పందం కోసం దావోస్ టూర్‌కు రేవంత్ రెడ్డి దారి ఖర్చులు వృధా చేశారని హరీశ్ రావు మండిపడ్డారు.
గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. రేవంత్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఏపీని ఆపడం చేతకాకుంటే.. అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి గురదక్షిణ చెల్లించుకొంటున్నట్లు అనుమానం కలుగుతోందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.