ఏపీలో వరద బాధితులకు అందాల్సిన పరిహారంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.602 కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 97 శాతం పంపిణీ పూర్తి చేశామన్నారు. బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా మిగిలిన బాధితులకు నగదు జమ కాలేదన్నారు. లబ్ధిదారులు బ్యాంక్ కు వెళ్లి కెవైసీ పూర్తి చేసుకోవాలని కోరామని…రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. సమీక్షలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.