ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొండా సురేఖ వివాదం హాట్ టాపిక్ గా నడుస్తోంది. మంత్రి స్థాయిలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై.. సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. ఒక మహిళగా ఉండి, వేరొక మహిళపై తప్పుడు ఆరోపణలు చేసిన సురేఖ.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలు కొండా సురేఖ ఏమన్నది?
‘నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం. ఎన్ కన్వెన్షన్ హాల్ కూలగొట్టొద్దు అంటే సమంతని తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీంతో నాగార్జున సమంతపై ఒత్తిడి తెచ్చాడు. సమంత ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇచ్చారు.’ అంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని బెదిరించి హీరోయిన్లను కేటీఆర్ లొంగబర్చుకున్నాడని, అందుకే రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లు పెండ్లి చేసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ మీడియాలోనూ సంచలనంగా మారాయి.
కోర్టులో పరువునష్టం దావాలు..
కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ తో పాటు సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖ అసంబద్ధ వ్యాఖ్యలతో తమ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, తమ కుటుంబ పరువుకు భంగం కలిగించారని హీరో నాగార్జున నాంపల్లి హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. ఇక, తనపై అసత్య ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్, సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే కోర్టులో కేసు పెడతానని పేర్కొన్నారు.
సినీ ప్రముఖులు ఏమన్నారంటే..
‘‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.’’
– హీరో నాగార్జున
‘‘నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు’’
– రామ్ గోపాల్ వర్మ
‘‘వ్యక్తిగత అంశాలను రాజకీయాలకు వాడుకోవడం బాధ కలిగించింది. బాధ్యతాయుత పదవిలో ఉంటూ రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం సిగ్గుచేటు. మీడియా ముందు గౌరవాన్ని కాపాడుకోవడం నైతిక బాధ్యత. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం నిరుపయోగం. నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు గౌరవంగా ప్రవర్తించాలి.’’
– హీరో వెంకటేశ్
“ఒక మహిళా మంత్రి ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చూసి చాలా బాధపడ్డాను. రాజకీయాల కోసం సెలబ్రిటీలను ఉపయోగించుకోవడం సిగ్గుచేటు. ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలను, దాడులను చిత్ర పరిశ్రమంతా వ్యతిరేకిస్తుంది. సంబంధం లేని వ్యక్తులను, అంతకుమించి మహిళలను తమ రాజకీయాలకు వాడుకోవడం అత్యంత అసహ్యకరమైన చర్య. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి’’
– హీరో చిరంజీవి
‘‘కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె.. తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె స్వార్థపూరిత వ్యాఖ్యలు విలువలు, సామాజిక స్పృహ కలిగిన అమాయక వ్యక్తులకు భంగం కలిగించాయి. సిగ్గు లేకుండా నిరాధార ఆరోపణలతో దాడి చేసి, బలిపశువులను చేసింది. సమాజంలో ఇలాంటి వాళ్లకు చోటు లేదు.’’
– హీరో అఖిల్ అక్కినేని
‘‘పొలిటికల్ మైలేజీ కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపర్చడం సరైంది కాదు. రాజకీయాల కంటే వ్యక్తుల గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే సినీ పరిశ్రమ సహించదు.’’
– హీరో ప్రభాస్
‘‘కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారం. గౌరవప్రద వ్యక్తుల గురించి అసభ్యకరంగా మాట్లాడడం బాధాకరం. ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావడం సిగ్గుచేటు. ఇలాంటి అపవాదులు సమాజ మూలాధారాలను నాశనం చేయడమే. సినీ పరిశ్రమ ఏ మాత్రం సహించదు. ప్రజాప్రతినిధులు సమాజాన్ని ఉద్దరించాలి అంతేగాని చీల్చకూడదు.’’
– హీరో రాంచరణ్
‘‘మంత్రి కొండా సురేఖ మాట్లాడిన పరుషమైన, అనవసరమైన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం, ముఖ్యంగా ఒక మహిళ గురించి చెడుగా మాట్లాడడం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి ప్రవర్తనను సినీ వర్గాలు సహించవు. రాజకీయాల కోసం సినీ ప్రముఖులను, వారి కుటుంబాలను టార్గెట్ చేయడం మానేయాలి. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలి కానీ ఇలాంటి వాటిపై కాదు.’’
– హీరో వరుణ్ తేజ్