విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులను ఓదార్చి, వారికి ధైర్యం కల్పించారు. అలాగే, వైద్యులతో బాలికల ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ మాట్లాడుతూ, కేజీహెచ్‌లో ప్రస్తుతం 65 మంది బాలికలు చికిత్స పొందుతున్నారని, కురుపాంలో అస్వస్థతకు గురైన బాలికలు విశాఖకు రావాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తుందని విమర్శించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, చికిత్స పొందుతున్న ప్రతి బాలికకు రూ. 1 లక్ష పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని, బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తామని, మెడికో లీగల్ కేసులు వేస్తామని తెలిపారు. నీటి సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోందని, ఆర్వో ప్లాంట్‌ను తక్షణం రిపేర్ చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. అదే విధంగా, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని జగన్ పేర్కొన్నారు.