ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. వారానికి కనీసం ఒకసారి చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా ఆ రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ – “చేనేత మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబన” అని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
చేనేత రంగానికి తీసుకున్న నిర్ణయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో చేనేత రంగానికి లబ్ధి చేకూరే పలు నిర్ణయాలు తీసుకున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, సొసైటీల ద్వారా ఆప్కో కొనుగోలు చేసే ఉత్పత్తులపై జీఎస్టీకి 5% రాయితీ,
త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు, చేనేత వస్త్రాల వినియోగం పెంచే దిశగా ప్రచార కార్యక్రమాల విస్తరణ,
ప్రభుత్వం పూర్తి అండ
చేనేత రంగం అసంఘటిత రంగాలలో ఒకటని, దీనికి మరింత ఊతమివ్వడం అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు. కళాకారుల కష్టానికి గుర్తింపుగా, వారిని ప్రోత్సహించడానికి వినియోగదారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.