దిల్లీలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఇద్దరు మైనర్లను ఉగ్రవాద నిరోధక దళం అదుపులోకి తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరు బాలురు పాకిస్తాన్లో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాల మేరకు నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఉగ్రవాద భావజాలం ప్రచారం చేస్తున్నారు. స్థానిక యువకులను రాడికలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. భారత్‌లో మైనర్లను ఉగ్రవాదంలోకి తీసుకురావడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. రాయ్‌పూర్‌తో పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

