తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు కల్పించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ల విడుదల షెడ్యూల్ ప్రకటించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు మరియు ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. సర్వదర్శనం టోకెన్ల కోసం డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా డిసెంబర్ 7న ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్లు కేటాయిస్తారు.
మరోవైపు తిరుమల క్షేత్రంలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయి క్యూ లైన్లు శిలాతోరణం వరకు చేరుకున్నాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. శుక్రవారం ఒక్కరోజే 63 వేల 645 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా హుండీ ద్వారా 3 కోట్ల 98 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది.

