ఇటలీ దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులు ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బురఖా మరియు నిఖాబ్ వంటి వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. దిగువ సభలో 142 అనుకూల ఓట్లతో ఆమోదం పొందిన ఈ చట్టం ప్రకారం పాఠశాల వేళల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే వస్త్రాలు ధరించిన వారికి 200 నుంచి 1000 యూరోల వరకు జరిమానా విధించనున్నారు. మైనర్ విద్యార్థులు నిబంధనలు ఉల్లంఘిస్తే వారి తల్లిదండ్రులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ముఖం కనిపించేలా ధరించే హిజాబ్ కు ఈ నిషేధం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత మరియు సమాజంలో సమైక్యతను పెంపొందించడానికే ఈ చట్టాన్ని తెచ్చామని మెలోని ప్రభుత్వం సమర్థించుకుంది. అలాగే 2027 28 విద్యా సంవత్సరం నుంచి ఇటాలియన్ భాషపై పట్టు లేని విదేశీ విద్యార్థుల ప్రవేశాలను 30 శాతానికి పరిమితం చేశారు. ఈ చట్టం వివక్షను ప్రోత్సహిస్తోందంటూ ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేశారు.

