ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కావాలని ప్రభుత్వం ఇదివరకే గవర్నర్ ను కోరింది. ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపి అరెస్ట్ చేయాలని భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ కూడా పెట్టారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎదురయ్యే పరిణామాలను కూడా చర్చించారు. ఫార్ములా ఈ కార్ రేసులో మంత్రి మండలి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం ఈ కేసుకు ప్రధాన కారణాలు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు, గత స్పెషల్ సెక్రటరీ అర్వింద్ కుమర్, చీఫ్ ఇంజనీర్ ను బాధ్యులుగా చేశారు.