భారత రైల్వే సంస్థ ప్రయాణికులకు షాకివ్వనుంది. రైల్వే టికెట్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. 2013, 2020లలో పెంచిన ధరలతో పోలిస్తే ఈ పెంపు నామమాత్రమేనని అధికారులు పేర్కొంటున్నారు. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతులపై కిలోమీటరుకు ఒక పైసా, ఏసీ తరగతులపై కిలో మీటరకు రెండు పైసల చొప్పున పెంచనున్నారు. సాధారణ సెకెండ్‌క్లాస్‌లో 500 కిలోమీటర్లలోపు ప్రయాణాలకు టికెట్ ధరలో ఎలాంటి మార్పు ఉండబోదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లేవారికి కిలోమీటరుకు అరపైసా చొప్పున పెరగనున్నట్లు సమాచారం. సబర్బన్ రైళ్లకు, నెలవారీ సీజన్ టికెట్ తీసుకునేవారికి ఎలాంటి పెంపు ఉండదని తెలుస్తోంది. గతంలో 2020 జనవరి 1న, 2013లో రైల్వే టికెట్ ధరలు పెంచారు.