- కాళేశ్వరం రిపోర్టుపై ప్రధాన చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రధాన చర్చ జరగనుంది. రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఈ రిపోర్టును ఆమోదించగా, 600 పేజీలకు పైగా ఉన్న పూర్తి నివేదికను సభలో సభ్యులకు అందజేయనున్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి, తర్వాత తుది నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇక తొలి రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మరణం పట్ల సంతాపం ప్రకటించి సభను వాయిదా వేయనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో అసెంబ్లీ సమావేశాల అజెండా, వ్యవధి వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ, శనివారం నిమజ్జనం కారణంగా ఈ సమావేశాలు గురువారంతోనే ముగిసే అవకాశం ఉంది. అసెంబ్లీ అనంతరం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రుల కమిటీ మూడు ప్రతిపాదనలను సూచించింది. వాటిలో ప్రత్యేక జీవో జారీ చేయడం, పార్టీ ఆధారంగా అమలు చేయడం లేదా బీసీ బిల్లులు, ఆర్డినెన్స్పై న్యాయపరంగా పోరాటం చేయడం ఉన్నాయి.