జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో బుధవారం ఉదయం భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా అధికారులు ధ్రువీకరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… జెన్ ప్రాంతంలో కంచె వెంబడి ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికలను దళాలు గుర్తించాయి. వెంటనే ఉగ్రవాదులు భద్రతా దళాల బృందంపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ పేర్కొంది. భారత్‌లోకి చొరబడే ప్రయత్నంలో ఉన్న ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ నలీన్ ప్రభాత్ ప్రకటించారు.