శత్రు ఆస్తుల అమ్మకంతో భారత్‌కు లక్షల కోట్ల లాభం.. అసలు దీని కథేంటి?
దేశంలోని శత్రువుల ఆస్తులు అమ్మడంతో భారత ప్రభుత్వానికి భారీ లాభం చేకూరింది. ఏకంగా రూ.లక్షల కోట్లు మన ఖజానాలోకి వచ్చి చేరనున్నాయని తెలుస్తోంది. ఇందులో అధిక భాగం షేర్లు, బంగారం, రెవెన్యూ రిసీట్లు లాంటి చరాస్తుల రూపంలోనే ఉన్నట్లు సమాచారం. అసలు శత్రువుల ఆస్తి అంటే ఏంటి? శత్రువుల ఆస్తులను అమ్మే హక్కు మనకు ఎక్కడిది? అనే కదా మీ సందేహం. దాని గురించి తెలుసుకుందాం..
Must Read: ఇండియాలో ఈ టెక్నాలజీకి మస్తు డిమాండ్.. ప్రారంభ వేతనం రూ.14 లక్షలు!
శత్రువుల ఆస్తి అంటే..
ఇండియా-పాకిస్థాన్ విభజన, 1962, 1965 యుద్ధాల అనంతరం భారతీయులు ఎవరైనా సరే.. పాకిస్థాన్, చైనా వెళ్లేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్నవారు మాత్రం తమ స్థిర, చరాస్తులు కేంద్ర సర్కారుకే చెందుతాయని అప్పట్లో నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అలా వారు వదిలివెళ్లిన ఆస్తులనే ‘ఎనిమీ ప్రాపర్టీ’ అని అంటారు. ఆ ఆస్తులు, భూముల నిర్వహణ బాధ్యతను సెపీకి కేంద్రం అప్పగించింది.
వేలం ప్రక్రియ షురూ
అలాంటి శత్రు ఆస్తుల తొలగింపు, అమ్మకం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దేశంలో మొత్తంగా చూసుకుంటే.. దాదాపుగా 12,611 శత్రు ఆస్తులు ఉన్నట్లు తేలింది. వాటి విలువ రూ. లక్ష కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆస్తులను అమ్మే పనిని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా (సీఈపీఐ)కి కేంద్రం అప్పగించింది. దీంతో ఈ ఆస్తులను ఇటీవలే వేలం వేశారు.
శత్రు ఆస్తుల విక్రయానికి ముందు సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమీషనర్ సాయంతో ఆ ఆస్తుల తొలగింపు ప్రక్రియను మొదలుపెడతారు. ఇప్పటివరకు శత్రు ఆస్తుల అమ్మకాల ద్వారా కేంద్ర ఖజానాలోకి రూ.3,400 కోట్లకు పైగా వచ్చి చేరాయని హోం శాఖ అధికారులు తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ 20 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న శత్రు ఆస్తులపై జాతీయ సర్వేను నిర్వహించింది. అందులో ఉన్న ఎమినీ ప్రాపర్టీస్ను గుర్తించి వాటిని వేలం వేసి డబ్బులు ఆర్జించింది.
అత్యధిక ఎనిమీ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయంటే..!
శత్రు ఆస్తుల అమ్మకాల ద్వారా వస్తున్న ధనాన్ని పర్యవేక్షించేందుకు మోడీ సర్కారు 2020లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో మంత్రుల బృందాన్ని (సీఓఎం) ఏర్పాటు చేసింది. 12,611 ఎనిమీ ప్రాపర్టీస్లో మొత్తం 12,485 పాక్ పౌరులకు, 126 చైనా పౌరులకు సంబంధించినవిగా తేలింది. అత్యధిక సంఖ్యలో శత్రు ఆస్తులు ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ (6,255 ఆస్తులు), పశ్చిమ బెంగాల్ (4,088 ఆస్తులు) ఉన్నాయి. అత్యల్ప ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నవిగా డామన్ డయ్యూ (10), ఆంధ్రప్రదేశ్ (1), అండమాన్ నికోబార్ దీవులు (1) నిలిచాయి.