తెలంగాణలో ఈ ఫార్ములా కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి లేదా చార్జిషీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సవరణల ప్రకారం ఇది అవసరమని తెలిపారు. విచారణకు గవర్నర్ అనుమతి లభించినా, చార్జిషీట్‌కు ఇంకా ఆమోదం రాలేదని, మూడు నెలలుగా ఆలస్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా చర్యలు తీసుకుంటే బెయిల్ సులభంగా లభిస్తుందని చెప్పారు. బీజేపీపై సవాల్ విసిరి, అవినీతి విషయంలో రాజీలేదని చెప్పిన బీజేపీ ఎందుకు కేటీఆర్‌ను వదులుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు ఉన్నా సీబీఐ విచారణ ఆలస్యం ఎందుకని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ‘ఫెవికాల్ బంధం’ ఉందా అని సూటిగా అడిగారు.

