బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావం కొనసాగనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలో ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ములుగు, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఆదివారం కూడా ఈ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.